Latest Movie :

ఉప ఎన్నికల ఫలితాలు-జగన్ పై కుట్రకు సమాధానమా

డరాష్ట్రంలో జరిగిన పద్దెనిమిది శాసనసభ,ఒక లోక్ సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలలో అందరూ ఊహించిన రీతిలోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.అయితే రెండు చో్ట్ల సంచలన ఫలితాలు వచ్చినా, అవి పూర్తిగా ఊహించనవి కావు. తెలంగాణలో సైతం టిఆర్ఎస్ గెలిచినా, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తొలిసారి పోటీచేసి ఆ పార్టీని నీళ్లు తాగించిందని చెప్పవచ్చు. జగన్ పార్టీకి ఎందుకు ఇంత ఆదరణ లభించిందన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.సాధారణంగా ఏ ఎన్నికలలో అయినా ఒక రాజకీయ పార్టీ గెలవడానికి అనేక కారణాలు ఉంటాయి.ఏ ఒక్క కారణమో పూర్తి విజయానికి బాటలు వేయదు.అలాగే జగన్ విషయంలో కూడా పలు కారణాలు ఉన్నాయి. జగన్ గత రెండేళ్లుగా చేసిన ఓదార్పుయాత్ర, రకరకాల దీక్షలు జగన్ నిలబడడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత జగన్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు, సిబిఐ అరెస్టు చేసిన వైనం, తదుపరి ఆయన మాతృమూర్తి విజయమ్మ, సోదరి షర్మిల సంచలన యాత్రలు చేసిన తీరు కూడా జగన్ పార్టీకి బాగా ఉపయోగపడ్డాయని చెప్పాలి. అయితే అన్నిటిని మించి అవినీతి విషయంలో జగన్ కు ఎందుకు సానుభూతి రావాలి?ప్రత్యర్ధులు లక్షల కోట్ల అవినీతి అని చెప్పినా ఎందుకు నమ్మలేదు? ప్రజలు పొరపాటు చేశారని పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటి వారు వ్యాఖ్యానించడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికే పెద్ద పీట.బొత్సను గెలిపించిన ప్రజలే ఇప్పుడు జగన్ పార్టీని గెలిపించారు.బొత్సను గెలిపించడం కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. అంత మాత్రాన జనం పొరపాటు చేశారని అంటామా? అలాగే సానుభూతి పనిచేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు. అది నిజమే. అయితే కేవలం సానుభూతి ఒక్కటే కాదు.బొత్స అన్నట్లు ప్రభుత్వ వ్యతిరేకత కూడా జగన్ ఖాతాలోకి వెళ్లింది. ప్రతిపక్ష టిడిపికి రావాల్సిన ప్రభుత్వ వ్యతిరేకత జగన్ సొంతం చేసుకున్నారు. దానికి టిడిపి స్వయంకృతాపరాధమేనని చెప్పాలి.అది వేరే విసయం.అయితే జగన్ పై ఎందుకింత ఆదరణ పెరగాలి?ప్రజలు జగన్ లో ఏమి చూశారు.లేదా జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్,టిడిపిలు చేసిన ప్రచారాన్ని ఎందుకు పట్టించుకోలేదు? అన్నప్రశ్నలకు సమాదానం వెదకవలసి ఉంటుంది. వీటికి ప్రధాన కారణం జగన్ కు వ్యతిరేకంగా ఇతర పార్టీలు అన్ ఫెయిర్ గేమ్ ఆడాయని జనం నమ్మినట్లు కనిపిస్తుంది.ఒక్కటి మాత్రం వాస్తవం. రాష్ట్ర చరిత్రలోకాని, ఆ మాటకు వస్తే దేశ చరిత్రలో కూడా ఎక్కడా జగన్ కు వ్యతిరేకంగా జరిగినన్ని కుట్రలు మరే నాయకుడికి ఎదురు అయి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. రాజకీయాలలో కుట్రలు తప్పక ఉంటాయి.కాని జగన్ విషయంలో అవి హద్దులు దాటాయి.ఓదార్పు యాత్ర పేరుతో జగన్ తన మానాన తిరుగుతుంటే అతనిని వదలిపెట్టి ఊరుకుంటే , అతనే నానా తంటాలు పడాల్సి వచ్చేది. కాంగ్రెస్ కాని, టిడిపి కాని నిత్యం ఓదార్పుయాత్రపై విమర్శలు చేస్తూ అతనిని రాజకీయంగా నిత్యతం జనంలో ఉండేలా చేశారు.ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాఫ్టర్ ప్రమాదంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించినప్పటి నుంచి ఈ కుట్రలు ఆరంభమయ్యాయనిపిస్తుంది. జగన్ కు అనుకూలంగా ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ జరిగిన మాట వాస్తవం. మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్ ను సి.ఎమ్. చేయాలని అంటే పార్టీ అధిష్టానం నో చెప్పడంతోనే ఈ కుట్ర ఆరంభమైంది. ఆ తర్వాత ముందు ఓదార్పుయాత్రను ఆరంభించడానికి అనుమతించి,తదుపరి ఇలా చేయాలి, అలా చేయాలని శాసించడానికి సోనియాగాంధీ ప్రయత్నించడంలో ఏదో కుట్ర కనిపించింది.జగన్ తో రోశయ్య అభ్యర్ధిత్వాన్ని ప్రతిపాదింప చేసిన కాంగ్రెస్ హై కమాండ్ కిరణ్ ను ముఖ్యమంత్రిని చేసినప్పుడు జగన్ ను కనీసం పట్టించుకోలేదు. ఇదీ కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది.ఆ తర్వాత జగన్ బాబాయి వివేకానందరెడ్డిని వేరు చేసి ఆయనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని కుట్రగానే జగన్ మద్దతుదారులు భావించారు. అయితే ఇది రాజకీయం కనుక దీనికి అభ్యంతరపెట్టజాలం. ఆ తర్వాత జగన్ పార్టీని వదలి సొంతంగా పార్టీని స్థాపించుకున్న తర్వాత నిజానికి కాంగ్రెస్ జగన్ విషయాన్ని పక్కనబెట్టి పరిపాలన మీద, తెలంగాణ అంశాన్ని పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది.కాని అలా కాకుండా జగన్ పైనే దృష్టి ఎట్టి అతనిని ఎలా వేధించాలా అన్న ప్రణాళికలు రచించిందన్న అబిప్రాయం ఉంది.ఆ తర్వాత జగన్ ఎమ్.పి పదవికి, ఆయన తల్లి విజయమ్మ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనంలోకి వెళ్లినప్పుడు పులివెందులలో వివేకానే కాంగ్రెస్ పోటీగా నిలబెట్టి వై.ఎస్.కుటుంబంలో చీలిక తేవడానికి ప్రయత్నం చేసింది. కాని ప్రజలు మాత్రం జగన్ ,విజయమ్మలకే పట్టం కట్టారు.ఆ తర్వాత అసలు కుట్ర ఆరంభమైందనిపిస్తుంది.కాంగ్రెస్ లో ఉన్నంతవరకు జగన్ ఆస్తులపై కాని, ఆయన అవినీతిపై కాని మాట్లాడని కాంగ్రెస్ పార్టీ ఆయనపై కేసు వేయించింది. సీనియర్ ఎమ్మెల్యే శంకరరావు తో హైకోర్టుకు లేఖ రాయించడం ఏమిటో?హైకోర్టు అందులో సంతకం కూడా ఉందో, లేదో చూసుకోకుండా విచారణకు ఆదేశించడం ఏమిటో?సిబిఐ ప్రాధమిక దర్యాప్తు నివేదికను ఇచ్చినా హైకోర్టు రహస్యంగా ఉంచడం ఏమిటో?పూర్తి విచారణకు ఆదేశించడం ఏమిటో? అసలు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఏమిటి? వాటిలో అవకతవకలు జరిగాయని భావిస్తున్నదా?లేదా? అన్నదానిని తెలుసుకోగోరినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో?అయినా హైకోర్టు దానిని పట్టించుకోకుండా సిబిఐతో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడం ఏమిటో?ఆ తర్వాత హైకోర్టు అసలు ఆ కేసు ఏమవుతోందో పర్యవేక్షించకపోవడం ఏమిటో?ఇక నేరుగా సిబిఐ ఢిల్లీ ఆఫీస్, లేదా హోం శాఖ, కాంగ్రెస్ హై కమాండ్ నేరుగా సిబిఐ వ్యవహారాలను నడుపుతోందన్న భావన కలగడం ఏమిటో?అంతేకాదు. శంకరరావే మరికొందరు మంత్రులపై ఇదే తరహాలో హైకోర్టుకు ఫిర్యాదు చేస్తే ఆయనను మెంటల్ అన్నట్లు వ్యాఖ్యానించడం!జగన్ కేసులో ఒకరకంగా, మంత్రుల కేసులో హైకోర్టు మరో రకంగా వ్యవహరించడం కూడా కుట్ర అనజాలం కాని విమర్శలకు అవకాశం ఇచ్చింది. అంతేకాదు. జగన్ తల్లి విజయమ్మ టిడిపికి చెందిన వారిపై కోర్టుకు వెళ్లినప్పుడు ఒక్కో బెంచి ఒక్కోరకంగా వ్యవహరించడం కూడా అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది.ఇక జగన్ పై సిబిఐ విచారణను వేగంగా చేపట్టిన తీరు కూడా ఇదేదో కక్షపూరితంగా సాగుతోందా అన్న అభిప్రాయానికి ఆస్కారం ఏర్పడింది.అసలు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన రాజశేఖరరెడ్డి అవినీతికి పాల్పడితే,దానికి ఆయన కుమారుడు జగన్ పై (అప్పటికి ఇంకా ఈయన ఎమ్.పి కూడా కాదు)కేసు పెట్టే అవకాశం ఉందా అన్న చర్చ కూడా జరిగింది. పైగా ప్రభుత్వంలోని వారెవరికి సంబంధం లేదన్నట్లుగా జగన్ కు ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డిని ముందుగా అరెస్టు చేయడం కూడా ప్రజలు కుట్రగానే పరిగణించారు.జగన్ అవినీతికి పాల్పడ్డారా?లేదా అన్నదానిపై కన్నా, జగన్ ను మాత్రమే టార్గెట్ చేసి, మిగిలినవారు అవినీతిని చేసినా, ప్రభుత్వంలో బాధ్యులైనా వారందరిని వదలిపెడుడుతున్నారన్న భావన కలిగింది.ఇదంతా కుట్రగానే ప్రజలు చూశారు.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడే ఈ ఆరోపణలు వచ్చినా అధిష్టానం పట్టించుకోకపోవడం, అప్పుడు వైఎస్ ను పొగడడం, ఆయన మరణించాక ఆ తప్పులతో తమకు సంబంధం లేదన్నట్లుగా, రాజశేఖరరెడ్డి నుంచి తామేమీ డబ్బు పుచ్చుకోలేదన్నట్లుగా, అదంతా జగన్ కే వెళ్ళిందన్నట్లుగా కాంగ్రెస్ హై కమాండ్ వ్యవహరించిన తీరును ప్రజలు కుట్రే అనుకున్నారు.అంతేకాదు. అంతేకాదు.జస్టిస్ కక్రు ఎక్కడో కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవారైనా, ఎపిలో మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ గా పదవి ఇవ్వడాన్ని కూడా ప్రజలు సందేహంగానే చూశారు.ఆ తర్వాత సిబిఐ కేసు దర్యాప్తు సాగిన వైనం, సాక్షి ఖాతాల స్తంభింపచేయడానికి, ఆస్తులు జప్తు చేయడానికి చేసిన ప్రయత్నం ఇవన్ని ప్రజలు కుట్రలుగానే భావించారని అనుకోవాలి.అయితే హైకోర్టే వాటిని అడ్డుకోవడం ఆసక్తికరమైన పరిణామం.ఇక ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జగన్ ను అరెస్టు చేయడానికి సిబిఐ సన్నద్దం అయిన తీరు కూడా విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. ఒకపక్కన కోర్టుకు హాజరు కావలసి ఉండగా విచారణ పేరుతో ముందుగానే జగన్ ను పిలిచి మూడు రోజులు విచారించి ఆ తర్వాత అరెస్టు ప్రకటించడం, ఆయనను అరెస్టు చేయడం కోసం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణరావును అరెస్టు చేయడం కూడా ప్రణాళిక ప్రకారం జరిగాయన్న వాదనకు బలం చేకూర్చింది.అదే సమయంలో మిగిలిన మంత్రుల జోలికి వెళ్లకపోవడం కూడా ప్రజలు గమనించారు.నిజానికి నిమ్మగడ్డ ప్రసాద్ వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏమీ లేదు. పైగా ఆయన సొంత సొమ్ముతో వాన్ పిక్ కోసం భూమి కొన్నారు.అలాగే సొంత డబ్బునే సాక్షిలో పెట్టుబడి పెట్టారు. అయినా సిబిఐకి అది నేరంగా కనిపించింది. ఇది కూడా కుట్రలో భాగమేనా అన్న అబిప్రాయానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జగన్ ను జైలులో పెట్టిన తర్వాత విజయమ్మ, షర్మిల ప్రచారంలో దిగడంతో ఆ పార్టీకి కొత్త నాయకత్వం దొరికినట్లయింది.అది వేరే విషయం.ఇక ప్రచార పర్వం సందర్భంగా టిడిపి నేతలు అత్యుత్సాహంగా లక్ష కోట్ల అవినీతిని పదిహేడు లక్షల కోట్లుగా ప్రకటించడం, ముఖ్యమంత్రి కిరణ్ ఏకంగా జగన్ కు పద్నాలుగు ఏళ్ల శిక్షపడుతుందని ప్రచారం చేయడం,ఇలా రకరకాల ఆరోపణలు గుప్పిస్తూ జగన్ ఒక్కడినే అవినీతిపరుడని చూపడానికి జరిగిన ప్రయత్నాలను కూడా ప్రజలు అంతగా హర్షించలేదని అనుకోవాలి.అంతదాకా ఎందుకు గాలి జనార్ధనరెడ్డి బెయిల్ ముడుపుల కేసు బహిర్గతం కాగానే దానిని జగన్ కు లింకు పెట్టి కొందరు మాట్లాడిన తీరును కూడా జనం కుట్రగానే చూశారని అనుకోవాలి.అంత మాత్రాన ప్రజలంతా అవినీతికి మద్దతు ఇస్తున్నారని అనుకోనవసరం లేదు.కాకపోతే ఇందులో విచక్షణ చూపుతూ జగన్ ను వేధిస్తున్నారన్న నమ్మకమే జనంలోకి వెళ్లింది.ఇక సిబిఐ కూడా స్వతంత్రగా కన్నా ఏదో బయట శక్తి చేతిలో ఉన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు గురి కావడం బాధాకరం.గాలి జనార్ధనరెడ్డి కేసులో సిబిఐకి మంచి పేరే వచ్చింది. కాని జగన్ కేసు వచ్చేసరికి ఇన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సైతం తమ పార్టీ ఓటమికి సిబిఐ బాధ్యత వహించాలని అంటున్నారు. ఉప ఎన్నికల మధ్యలో జగన్ ను అరెస్టు చేయడం వల్ల తమ కొంప మునిగిందని వాయలార్ రవి కూడా అన్నారంటేనే నేతలు వాడుకున్నంత సేపు వాడుకుని ఆ తర్వాత నెపం దానిపై నెట్టడానికి వెనుకాడరని అర్ధం అవుతూనే ఉంద.మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి అయితే ఏకంగా కాంగ్రెస్ ఓటమికి సిబిఐనే బాధ్యత వహించాలని అన్నారు.ఈ రకంగా చూసినా ఇందులో ఏదో కుట్ర ఉందని జనం అనుకునేలా పరిస్తితులు ఏర్పడ్డాయి. నిజానికి వీటన్నిటిలో కుట్ర ఉందా?లేదో అంటే, కచ్చితంగా ఇది అని చెప్పలేనప్పట్టికీ, కుట్ర ఉంది అనుకునే విధంగా పరిస్థితులు ఏర్పడిన మాట నిజం.అదే జనానికి నచ్చలేదు. ప్రజలు చాలావరకు ఫెయిర్ రాజకీయాలు కోరుకుంటారు.మరీ రాజకీయ అన్ ఫెయిర్ గా పోతుంటే సహించలేరనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా తీసుకోవచ్చు.ఇకనైనా కుట్ర స్వభావంతో కాకుండా నిష్పక్షపాతంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోందని ప్రజలు విశ్వసించేలా వ్యవహరించాలి.అలాగే కాంగ్రెస్ వల్ల రాష్ట్రం నష్టపోవడం లేదని భావన కలిగితేనే కాంగ్రెస్ మనుగడకు అవకాశం ఉంటుంది.జగన్ జైలు లో నుంచి బయటకు వచ్చాక పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేం.ప్రస్తుతానికి మాత్రం జగన్ కు వ్యతిరేకంగా సాగిన కుట్రలను ప్రజలు నిర్ద్వద్వంగా తిరస్కరించారని అనుకోవాలి.

తగ్స్:ఉప ఎన్నికల ఫలితాలు-జగన్ పై కుట్రకు సమాధానమా

Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Tollywoodz - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger